వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు కేసుల్లో ప్రభుత్వ నిర్ణయాలు నిలబడ లేదు. న్యాయస్థానాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. అయితే.. ఎన్నికల వేళ వైసీపీకి న్యాయస్థానాల్లో బిగ్ రిలీఫ్ దొరుకుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ పైన సుప్రీం తీర్పు వైసీపీకి అనుకూలంగా వచ్చింది. చంద్రబాబు హయాంలో కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీకి గురయ్యాయని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. ఇక ఈ విషయంలో మొదట హైకోర్టు తీర్పు టిడిపికి అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వ౦ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. చివరకు సుప్రీం కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. అదేవిధంగా.. తాజాగా అమరావతిలో ఇళ్ళ స్థలాల కేటాయింపు విషయంలో వచ్చిన జడ్జిమెంట్ ప్రభుత్వానికి రిలీఫ్ అయ్యింది. అమరావతిలో పేదలకు ఇళ్లు కోసం స్థలాలు కేటాయింపు పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని అమరావతి ప్రాంత వాసులు అభ్యంతరం చెబుతూ న్యాయస్థానం ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇంటి స్థలాల మంజూరుకు మార్గం సుగమం చేస్తూ తీర్పు వెలువడింది. ఈ రెండు నిర్ణయాల వెల్లడి సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇదిలా ఉంటే.. అమరావతి రైతులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. అమరావతి రైతులకు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.