వెలుగులోకి దస్తగిరి తొలి స్టేట్ మెంట్

రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించన వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అంశాలు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వేళ వివేకా రెండో భార్య సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ స్టేట్మెంట్ లో ఆస్తి తగాదాలు కీలకంగా పర్ణవన్నారు.. షేక్ షమీమ్. ఇప్పుడు తాజాగా మరో స్టేట్మెంట్ వెలుగులోకి వచ్చింది. సీబీఐకి దస్తగిరి ఇచ్చిన తొలి స్టేట్ మెంట్ తాజాగా బయటకు వచ్చింది. అంటే దస్తగిరి అప్రూవర్ గా మారకమునుపు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇందులో దస్తగిరి పేర్కొన్న విషయాలకు, ప్రస్తుతం కస్టడీలో ఇచ్చిన స్టేట్ మెంట్ లోని వివరాలకు చాలా తేడాలు ఉన్నాయని తెలుస్తోంది. 25-8-2021న సీబీఐ ఈ ఈ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. అసలు ఈ స్టేట్మెంట్ లో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం. వివేకానంద రెడ్డితో తనకు 2016 నుంచే పరిచయం ఉందని దస్తగిరి చెప్పాడు. 2017 ఫిబ్రవరి నుంచి 2018 డిసెంబర్‌ వరకు ఆయనకు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిపాడు.ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోవడంతో దానికి కారణమైన వారితో పాటు తనను కూడా వివేకా దారుణంగా తిట్టారని దస్తగిరి స్టేట్మెంట్ లో వెల్లడించాడు. అదేవిధంగా.. సునీల్ యాదవ్ తోపాటుగా.. ఉమాశంకర్ , గంగిరెడ్డిలతో తనకు పరిచయం ఉందని దస్తగిరి స్టేట్మెంట్ లో ప్రస్తావించారు. అలాగే.. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారిని వివేకా తీవ్రంగా తిట్టారని, ఆ సమయంలోనే తనను కూడా ఇష్టమొచ్చినట్టు తిట్టారని దస్తగిరి వెల్లడించాడు.

ఆ తర్వాత.. కడపకు చెందిన రాధాకృష్ణమూర్తి, అతని కుమారుడు ప్రసాదమూర్తి మధ్య భూవివాదానికి సంబంధించిన సెటిల్ మెంట్ గురించి 2017 నుంచి 2018 వరకు బెంగళూరులో తిరిగామని చెప్పాడు. ఆ సెటిల్ మెంట్ తర్వాత వివేకాకు 8 కోట్లు వస్తాయనే విషయం తమకు తెలుసన్నాడు. అలాగే 2018లో వివేకానంద రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి బెంగళూరు వెళ్లారని దస్తగిరి తన స్టేట్‌మెంట్‌లో తెలిపాడు. ఇలా ఈ సెటిల్ మెంట్ గురించి తాజాగా వివేకా రెండో భార్య కూడా సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వివరించారు. అయితే.. ఆ ల్యాండ్ సెటిల్ మెంట్ లో వచ్చిన 8 కోట్లలో 50శాతం వాటా ఇవ్వాలని ఎర్ర గంగిరెడ్డి అడగడంతో వివేకా మండిపడ్డారని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాత వివేకాకు, గంగిరెడ్డికి మధ్య మాటలు బంద్‌ అయ్యాయని చెప్పాడు. ఈ క్రమంలోనే 2019లో ఎర్ర గంగిరెడ్డి తనను పిలిచి వివేకాను చంపాలని, లైఫ్ సెటిల్ అయ్యేంత పెద్ద మొత్తం ఇస్తామని, ఈ పథకం వెనక చాలా మంది పెద్దవాళ్లు ఉన్నారని ఎర్ర గంగి రెడ్డి తనతో చెప్పినట్లు తెలిపాడు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపడంతో వివేకాను హత్య చేసేందుకు ఒప్పుకున్నట్లు దస్తగిరి ఈ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు.