వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనంతరం రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ భరితంగా మారాయి. అసలు ఈ హత్యకు ఎవరు పాల్పడ్డారు…? కేసులో ప్రస్తుతం సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందా..? వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ కావాలనే అరెస్ట్ చేసిందా..? ఈ కేసులో అవినాశ్ రెడ్డిని ఇప్పటి వరకు నాలుగుసార్లు విచారించిన సీబీఐ.. మళ్ళీ ఎందుకు విచారణకు రమ్మని నోటీసులు జారీ చేసింది..? అంతేకాకుండా ఆయనను భాస్కర్ రెడ్డి సహ నిందితుడిగా చేర్చడం వెనుక ఆంతర్యం ఏంటి..? వైఎస్ అవినాశ్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేయబోతుందా..? ఈ హత్య వెనుక వివాహేతర, ఆర్థిక లావాదేవీలు, ఆధిపత్య పోరు, వివేకా రెండో భార్య, ఆమె కుమారుడికి ఆస్తి రాయించడం.. ఇలా ఎన్నో రకాల అంశాలు తెరపైకి వచ్చాయి. మరి వీటన్నీటిని ఆధారంగా చేసుకొని సీబీఐ విచారిస్తుందా..? లేక ఒకే కోణంలో విచారిస్తోందా..? ఈ కేసులో మొదట్లో టిడిపి నేతలు కూడా ఉన్నారని.. వివేకా కుమార్తె సునీత అప్పట్లోనే చెప్పుకొచ్చారు. మరి ఆ కోణంలో సీబీఐ విచారిస్తోందా..? లేక ఒకే కోణంలో విచారిస్తోందా..? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ఈ హత్య జరిగి నాలుగేళ్ళు పూర్తయినప్పటికీ.. ఈ కేసులో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఈ కేసుకు సంబందించి.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, సీబీఐ దహర్యాప్తు అధికారిని మార్చడంతో.. ఈ కేసులో వేగం మరింత పుంజుకుంది అనే చెప్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాతో విచారణ పూర్తి చేయడానికి సిద్దమైన సీబీఐ అధికారులు.. ఓ వైపు విచారణ, మరోవైపు అరెస్ట్ లు చేస్తోంది.
అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపధ్యంలోనే.. నెక్స్ట్ ఎవరు అంటూ.. ప్రధాన వార్తా పత్రికల్లోనూ, tv ఛానెల్స్ లోనూ అనేక రకాల చర్చలకు దారి తీస్తున్నాయి. భాస్కర్‌రెడ్డి అరెస్ట్ అనంతరం కడప జిల్లా వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. అయితే.. వైఎస్ వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులిచ్చింది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. వైఎస్ అవినాష్ కుటుంబానికి మద్దతుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి బలమైన వాదన వినిపిస్తున్నారు. భాస్కర్‌రెడ్డిని, అవినాష్ ని ఈ కేసులో సీబీఐ కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తుందని.. ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ కుట్రపూరితంగా విచారిస్తున్నట్టు అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించారు. మొదట్లో వివేకా కుమార్తె తన తండ్రిని హత్య చేసిన వారిలో టీడీపీ నేతల పేర్లు ప్రస్తావించారని ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి వారిని ఇప్పుడు ఎందుకు ఆమె పట్టించుకోలేదని ఎమ్మెల్యే రాచమల్లు గట్టిగానే ప్రశ్నింస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో సీబీఐ వేగం చూస్తుంటే.. కేసు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నేడు ఐదవసారి సీబీఐ విచారణకు హాజరు కాబోతున్న వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా.. లేదా అనేదే చూడాలి.