రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో ఉత్కంఠత నెలకొంది. ఆయన హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకాకు మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాల వల్లే ఈ హత్య జరగిందని, ఆస్తి తగాదాలే ఆయన మరణానికి కారణం అంటూ.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అసలు నిందితుల్ని తేల్చేందుకు, కుట్ర కోణాన్ని బయటపెట్టేందుకు ఓవైపు సీబీఐ ప్రయత్నిస్తుంది. ఈ కుసుకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. ఎంపీ అవినాష్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా.. ముందస్తు బెయిల్ కై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వీరికి ఊరటనివ్వొద్దంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. వివేకా రెండో భార్యగా భావిస్తున్న షేక్ షమీమ్, ఆమె కుమారుడు షహెన్ షా ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. వివేకా ఆస్తుల్లో వాటా కోరుతూ ఆయన రెండో భార్య షమీమ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. తన పేరిట, తన కొడుకు పేరిట వివేకానందరెడ్డి రాసిన వీలునామా ప్రకారం రావాల్సిన ఆస్తిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ కుమార్తె సునీత ఇప్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు పలు రకాల వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై ఆమె ప్రస్తుతం న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అసలు ఈ వార్తల్లో వాస్తవ అవాస్తవమెంత..? ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న విధంగా వివేకా రెండో భార్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే.. ఈ కేసు కీలక మలుపు తిరిగే ఛాన్స్ ఉందా..? సునీత ఎలాంటి స్టెప్ తీసుకుంటారు..? ఇలా పలు రకాల చర్చలకు తావిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎలాంటి టర్న్ ఉండబోతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులపాటు వేచి చూడాల్సిందే.