మంత్రి రజినికి షాక్

రాజకీయాలు అన్న తర్వాత వ్యతిరేకత, వర్గపోరు, ఆధిపత్య పోరు.. ఇలాంటివన్నీ షరా మామూలే. సొంత పార్టీలో ఉన్న నాయకులే.. ఒకరంటే ఒకరికి గిట్టదు. ఒకే జిల్లాలో ఉంటూ.. సొంత పార్టీ నాయకులనే కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానం ఉండదు. ఇలాంటి తంతు రాజకీయాలలో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే.. ఇలాంటి సంఘటన ప్రస్తుతం వైసీపీలోనూ తెరపైకి వచ్చింది. తాజాగా.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినిల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వివాదం మరింత ముదురుతుందనిపిస్తుంది. తాజా పరిణామాలే ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. తాజాగా సత్తెనపల్లి ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ కృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే మంత్రి రజినికి షాక్ ఇచ్చారు..ఎంపీ కృష్ణదేవరాయలు. శిలాఫలకంపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేరు కనిపించలేదు. ఇంకేముంది.. మంత్రి రజిని ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు. దీంతో అధికారుల తీరుపై మంత్రి రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి విడదల రజని ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నరసరావుపేట పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది. అయితే విడదల రజిని, శ్రీకృష్ణదేవరాయలు వర్గాల మధ్య అధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ప్రోటోకాల్ వివాదం కూడా ఎంపీ, ఎమ్మెల్యే అధిపత్య పోరులో భాగంగానే జరిగి ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ విషయంపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.