వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ది సాధ్యం అంటూ.. మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. మూడు రాజధానుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని.. అమరావతి రైతులు ఏపీ ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవోలను కొట్టేసింది. రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదంటూ కుండబద్దలు కొట్టింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం రాజధానుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం అమరావతి రైతులకుమరో షాక్ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో 14 ఎకరాలను ఈ-వేలం ద్వారా అమ్మడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఆ 14 ఎకరాలకు ధర కూడా నిర్ణయించారు. దీంతో అమరావతి రైతులు మండిపడుతున్నారు. రాజధానిని అభివృద్ధి చేయకపోగా ఇక్కడి భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటూ అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరితో ముడిపడి ఉన్న రాజధాని అంశాన్ని తేల్చకుండా భూములు అమ్మడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి భూములను అమ్మకానికి రెడీ చేస్తున్న ప్రభుత్వం ఈసారి ఏమి చేస్తుందో చూడాలి