రాజకీయాలలో ఎప్పడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఎవ్వరికీ తెలియని రహస్యం. చాలా మంది రాజకీయాలు తమకు ఏదో దక్కేలేదన్న అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం అధికార పార్టీలో కూడా అదే జరుగుతుంది. పార్టీలో పదవులు దక్కలేదనో..? లేక మరే ఇతర కారణాలతో తిరుగుబాటు చేస్తున్నారో తెలియదు గానీ.. ప్రస్తుతం వైసీపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిజానికి మొన్నటి వేళ కోటంరెడ్డి మాట్లాడిన తీరును బట్టి చూస్తే.. ఆయనకు పదవి దక్కలేదనే ఈ డ్రామా ఆడుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, దీనిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. మరి ఎవరికి ఫిర్యాదు చేశారో అది ఆయనకే తెలియాలి. ఇక అసలు విషయానికొస్తే.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ విషయంలో జగన్ సర్కారుకే తమ మద్దతుగా నిలిచారు. మద్దతు అనటం కంటే.. జగన్ సర్కారు ఎలాంటి తప్పు చేయలేదు అని తేల్చి చెప్పారు అనటం ఉత్తమం. ఎందుకంటే.. జేడీ లక్ష్మీనారాయణ ఉన్నది ఉన్నట్టుగా, పార్టీలతో సంబందం లేకుండా తప్పును తప్పుగా చెప్పే ముక్కుసూటి వ్యక్తి.
ఇతరుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయడం అంత సులువు కాదని జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ల వంటి అత్యున్నత ఏజెన్సీలకు మాత్రమే ఎవరి టెలిఫోన్నైనా ట్యాప్ చేసే అధికారం ఉంటుందని తెలిపారు. అవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేవని స్పష్టం చేశారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేంద్ర ప్రభుత్వం చేసింది అంటారా..? లేక ఎవరైతే తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యాయని ఆరోపణలు చేస్తున్నారో.. అదంతా డ్రామా అంటారో.. ? కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి చెప్పాలని రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారా.. లేక ఫోన్ రికార్డింగ్ చేశారా అనే విషయంపై స్పష్టత లేదని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రికార్డింగ్ డేటాను ఫోరెన్సిక్ పరీక్షకు పంపితేనే నిజం బయటపడుతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏమైనా సందేహాలుంటే ఫోరెన్సిక్ పరీక్ష లేదా మరేదైనా విచారణ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని ఆయన అన్నారు. అయితే.. జీవో నెంబర్ వన్ పై కూడా జేడీ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.