ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మందుబాబులకు ఏపీ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13న గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా.. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో 9 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో 5 అధికార వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. దీంతో మరో 4 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మూడు పట్టభద్రులు, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్లు లెక్కించి.. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.