వైఎస్ వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ రేపు విచారణకు రావాలని ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు వెళ్లబోయే ముందు అవినాష్.. నేడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన సీబీఐ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ హైకోర్టును కోరారు. సీబీఐ తనకు సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చినందున అరెస్టు కాకుండా ఈ ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును కోరారు.మరోవైపు సీబీఐ తనను ప్రశ్నించే సమయంలో వీడియో రికార్డింగ్ కావాలని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. అలాగే విచారణ సమయంలో తనతో పాటు లాయర్ ను కూడా అనుమతించాలని కూడా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. ఇప్పటికే గత విచారణ సందర్భంగా కూడా లాయర్ ను అనుమతించాలని అవినాష్ రెడ్డి కోరినా సీబీఐ అధికారులు అనుమతించలేదు. అలాగే వీడియో రికార్డింగ్ కూ అంగీకరించలేదు. దీంతో ఈసారి కచ్చితంగా ఈ రెండు అంశాల్ని సీబీఐ అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అవినాష్ రెడ్డి కోరారు. అటు సీబీఐ ఇప్పటికే జారీ చేసిన నోటీసుల మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి రేపు హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అదే సమయంలో హైకోర్టు కూడా అవినాష్ రెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.