కోడెల శివరామ్‌ కి కోర్టు షాక్

టీడీపీ నేత డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ తనయుడు కోడెల శివరామ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తాజాగా చీటింగ్‌ కేసు నమోదైంది. ఇలా ఆయన ఇప్పటికి పలుమార్లు వివాదాల పాలవడం చూస్తూనే ఉన్నాం. నమ్మించి మోసం చేసినందుకు గానూ ఆయనకు ఈ ఎదురుదెబ్బ తగిలింది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని.. గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించిన బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో పొందుపరిచారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్, అతడి భార్య పద్మప్రియ విజ్ఞప్తి మేరకు శివరామ్‌కే చెందిన కైరా ఇన్‌ఫ్రా కంపెనీలో 2016లో గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన పాలడుగు బాలవెంకటసురేష్‌ 25 లక్షల పెట్టుబడి పెట్టారు. మరో ముగ్గురు సుమారు కోటి వరకు పెట్టుబడి పెట్టారు.

అందుకు సంబంధించి చెక్కుల ద్వారా లావాదేవీ జరిపారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా శివరామ్, అతడి భార్య ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. బాలవెంకటసురేష్‌ పిటిషన్‌పై కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు శివరామ్‌పై పలు సెక్షన్ల కింద తెనాలి రూరల్‌ ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.