నారా లోకేష్ పాదయాత్రకు రెండు రోజులు బ్రేక్ పడింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా పాదయాత్రకు విరామం ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. 13న జిల్లాలో పోలింగ్ జరగనుంది. దీంతో యాత్రలకు అనుమతి లేకపోవటంతో లోకేష్ ఈ రెండు రోజుల తన యాత్రకు తాత్కాలిక విరామం ఇవ్వాలని నిర్ణయించారు. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. మధ్యలో తారకరత్న మరణించిన సమయంలో రెండు రోజులు యాత్రకు విరామం ఇచ్చారు. 41 రోజులుగా సాగుతున్న యాత్రలో ఇప్పుడు రెండు రోజుల తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పటి వరకు లోకేష్ యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 520 కిలోమీటర్ల మేర సాగింది. ఈ పాదయాత్రలో ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేశారు. ఈ నెల 14న మళ్లీ యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 520 కిలో మీటర్లు పూర్తి చేసారు. స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకం అవుతూ..వారి సమస్యలపైన స్పందిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగానూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి కేంద్రంగా యువతతోనూ లోకేష్ సమావేశమయ్యారు.