ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసలే
వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సీరియస్‌గా ఉంది. పార్టీ నుంచి పూర్తిగా వైదొలగకుండా ఆయన నానా యాగీ చేస్తున్నారని ఆగ్రహం చెందుతోంది. పార్టీకి పూర్తిగా దూరమైన ఆయన టీడీపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. రాష్ట్ర సేవాదళ్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించింది. బాధ్యతలు అప్పగించిన కొద్ది నెలలకే ఆ పదవి నుంచి తొలగించారు.
నిజానికి శ్రీధర్ రెడ్డిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత గిరిధర్‌ను ప్రోత్సహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. నెల్లూరు రూరల్ టికెట్ కూడా ఆయనకే ఇవ్వాలని భావించిందట. అయితే గిరిధర్ రెడ్డి అధిష్టానం ఆలోచనను అమలు చేయకుండా అన్నయ్య శ్రీధర్ రెడ్డి బాటలో నడుస్తున్నారట. దానితో ఆగ్రహించిన అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేసింది.నెల్లూరు వైసీపీలో వింతలు జరుగుతున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బజారున పడి తిట్టుకుంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయిన రెబెల్ స్టార్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అనిల్ ఇలాకాలో హల్ చల్ చేసేందుకు కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారు.