ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల కీలకపాత్ర ఉంటుందా..? వారికి ప్రభుత్వ ఫలాలు అందకపోతే.. ప్రభుత్వాన్ని దించే సత్తా ఉందా..? ఈ రకమైన ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చాయంటే.. గతంలో చంద్రబాబు హయాంలో ఉద్యోగులు ఆయనపై రగిలిపోయారని, చంద్రబాబు ఉద్యోగులకు హ్యాండ్ ఇచ్చారని, వారికి అందాల్సిన ప్రభుత్వ తరుపున ఫలాలు అందకపోవడంతో ఉద్యోగులంతా బాబుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని.. ఎన్నికల సమయంలో బాబుకి షాక్ ఇచ్చారని అప్పట్లో చర్చలు నడిచాయి. తాము అధికారంలోకి వస్తే.. సీపీఎస్ రద్దు చేస్తానని వైఎస్ జగన్ తమ పాదయాత్రలో హామీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఆ హామీ ప్రకటనను సిఎం జగన్ అమలు చేయలేదని, ఇంకా తమకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని.. జగన్ ప్రభుత్వం కూడా తమను అన్యాయం చేసిందని.. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని.. ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. గతంలో ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన సీపీఎస్ రద్దుపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోందని అంటున్నారు.
ఉద్యోగులకు గతంలో జగన్ పాదయాత్రలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీపై ప్రభుత్వం ఈ నెల 16న తుది దఫా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. అదే రోజు ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై కీలక నిర్ణయం ప్రకటిస్తామని ఇప్పటికే వెల్లడించింది. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే దాంతో ప్రభావితం అవుతున్న ఉద్యోగుల్లో ఆందోళన తగ్గుతుంది. ఆ మేరకు ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా తగ్గుతుంది. ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం ప్రారంభించిన నేపథ్యంలో ఉద్యోగులు పూర్తిగా ఉద్యమంవైపు మళ్లకుండా ఉండాలంటే ఓ ప్రకటన చేయక తప్పదు. జగన్ ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేస్తే గనుక వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులంతా జగన్ కి పూర్తి మద్ధతు తెలిపే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.