జనసేనికులకు షాక్ ఉత్కంఠ భరితంగా సభ

నేడు జరగనున్న జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉత్కంఠ భరితంగా మారింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్యక్రమం జరగనుంది. 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు. సభకు వస్తున్న కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేశారు. షెడ్యూల్ ప్రకారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో పవన్ రావాల్సి ఉంది. అయితే, అసెంట్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్న తరుణంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీకి రావాల్సి ఉంది. దీంతో వారి వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని, వారాహి ప్రయాణంలో మార్పు చేసుకోవాలని జనసేనకు పోలీసులు సూచించారు. సో.. ఈ మార్పుల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ విజయవాడ నొవొటెల్ నుండి విజయవాడ ఆటోనగర్ వెళ్ళి అక్కడ నుంచి వారాహి వాహనంపై బందరు సభా వేదికకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే పవన్ వారాహి వాహనంపై వెళుతుంటే వెనుక భారీ బైక్ ర్యాలీగా తాము కూడా వెళ్లేందుకు జనసేన క్యాడర్ కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెనుక వెళ్లే క్యాడర్ కు పోలీసులు షాకిచ్చారు. పవన్ వారాహి వాహనం వెనుక బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని కృష్ణాజిల్లా పోలీసులు తేల్చిచెప్పేశారు.బందరులో జనసేన పార్టీ ఆవిర్బావ సభ, ఇతర కార్యక్రమాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పోలీసు యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జాషువా ప్రకటించారు. కాబట్టి ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఒకవేళ పోలీసు ఆంక్షలు ఉల్లంఘంచి ర్యాలీ చేపడితే మాత్రం పోలీసు యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో పోలీసుల తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో వైసీపీ ఆవిర్బావ సభకు భారీ ర్యాలీల్ని అనుమతించి ఇప్పుడు జనసేనకు ఆంక్షలు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు.జనసేనికులు మాత్రం మనల్ని ఎవర్రా ఆపేది అంటూ, తగ్గేది లేదంటూ.. తాము ర్యాలీగానే వెళతామంతున్నారు. ఈ క్రమంలోనే.. జనసేన సభ ఉత్కంఠ భరితంగా మారనుంది.