మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుకు మరింత ఉచ్చు బిగుసుకుంటుంది. ఆయనపై ఇటీవలే ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం- నిబంధనలను ఉల్లంఘించిందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని ఇదివరకే తాను సుప్రీంకోర్టులో సమర్పించానని అన్నారు. మార్గదర్శి సబ్ స్క్రైబర్ల నుంచి సేకరించిన డబ్బులను ఆ సంస్థ యాజమాన్యం.. తమ గ్రూప్ కంపెనీల్లోని ఇతర వ్యాపారాల కోసం వాడుకుందని పునరుద్ఘాటించారు.
సబ్ స్క్రైబర్ల డబ్బులను దారి మళ్లించిందనేది వాస్తవమేనని తేల్చి చెప్పారు. మార్గదర్శి సంస్థలో పని చేసే ఫోర్ మెన్లకు కనీసం చెక్ పవర్ కూడా లేదని గుర్తు చేశారు. సబ్ స్క్రైబర్ల నుంచి సేకరించిన డబ్బులన్ని అప్పటికప్పుడు హైదరాబాద్ లోని మార్గదర్శి హెడ్ ఆఫీస్ కు చేరుతుందని, అక్కడి నుంచి ఇతర గ్రూప్ కంపెనీలకు బదలాయింపు జరుగుతోందని అన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని ఉండవల్లి పేర్కొన్నారు. మార్గదర్శిలో జరిగింది తప్పేనని, యాజమాన్యం చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించిందంటూ రిజర్వ్ బ్యాంక్ సైతం ధృవీకరించిందని ఉండవల్లి పేర్కొన్నారు. కంప్లైంట్ ఇచ్చే యంత్రాంగాన్ని మార్గదర్శి యాజమాన్యం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని అన్నారు. చివరికి తాను జోక్యం చేసుకున్నానని వివరించారు. ఏపీ ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అప్పట్లో ఆర్బీఐ తనకు సూచించిందని ఉండవల్లి పేర్కొన్నారు. రామోజీ రావు వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం- మార్గదర్శిలో డిపాజిటర్లు, సబ్ స్రైబర్లు దాచుకునే డబ్బేనని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు. ఈ డబ్బులన్నింటినీ దారి మళ్లిస్తోన్నారనడంలో సందేహాలు అక్కర్లేదని వివరించారు. అవసరం వచ్చినప్పుడు మన డబ్బులు మనం తీసుకోవడానికి ష్యూరిటీని మార్గదర్శి సిబ్బంది అడుగుతున్నారని ఉండవల్లి అన్నారు. మొత్తం నగదును విత్ డ్రా చేయడానికీ అవకాశం లేదని, ఎంత అవసరం ఉంటే అంతవరకే డబ్బులు రిటర్న్ చేయగలుగుతున్నారని చెప్పారు. సబ్ స్క్రైబర్ల డబ్బు మొత్తాన్నీ తీసుకెళ్లి రామోజీ రావు మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నాడని, ఇతర వ్యాపారాలకు మళ్లించుకుంటున్నారని పేర్కొన్నారు.