ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇప్పటి నుంచే రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో పావులు కదుపుతున్నాయి. ఈ నేపధ్యంలోనే సిఎం జగన్ సడన్ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ నెలకొంది. ఇంత హడావిడిగా సిఎం డిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏంటి..? మరి ముఖ్యంగా ప్రధాని మోడీ, అమిత్ షా లతో భేటీ ఎందుకు..? అన్న టెన్షన్ ప్రతిపక్షాలకు నెలకొంది. నేడు ఏపీ అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. అయితే.. నేటి సాయంత్రం సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు అని అంటున్నారు. ఆయన రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారని చెబుతున్నారు. ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా జగన్ అకస్మాత్తుగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లడం మీద సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే.. ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే.. మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకే ఆయన సడన్ డిల్లీ పర్యటన పురమాయించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాము విశాఖకు షిఫ్ట్ అవుతున్నామని సిఎం జగన్ ఇప్పటికి ముమ్మారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా అంతా సులువుగా పాలనా రాజధానిగా విశాఖకు షిఫ్ట్ అవడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలోనే.. బీజేపీ నేత సుజనా చౌదరీ తాజాగా రాజధాని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సిఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు మార్చుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అది తమ ఇష్టమని తేల్చి చెప్పారు. కానీ ఏపీ రాజధానిగా అమరవతినే కొనసాగించాలని సిఎం జగన్ కి పలు రకాల సూచనలు ఇచ్చారు. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు జగన్ సర్కారుకి చివరి సమావేశాలు. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోతే.. మూడు రాజధానుల అంశం హోల్డ్ లో పడిపోతుంది. ఇప్పుడు ఈ మూడు రాజధానుల వ్యూహంతోనే.. జగన్ సర్కార్ ఎన్నికలకు సిద్దం కానుంది. మరి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టాలంటే.. ముందుగా సుప్రీం కోర్టులో ఉన్న ఈ కేసులో ఏదో ఒక తీర్పు వచ్చిన తర్వాతనే అంటున్నారు.. మరికొందరు విశ్లేషకులు. మరి ఇలాంటి తరుణంలో సిఎం జగన్ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.