పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని.. శ్రీరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చెరుకూరి వెంకటరాముడు సోమవారం ఎస్పీ రాహులేవ్సేంగ్కు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేయడమేగాక దాన్ని రాసి ఇవ్వమంటున్నారని, లేకపోతే చంపేస్తామని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని తెలిపారు. పరిటాల సునీత కబ్జాచేసిన తన భూమిని తనకు ఇప్పించాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీరామ్ కి మరో షాక్ తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గ౦లో ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఆ మేరకు అక్కడ పనులు చక్కబెట్టుకుంటున్నారు. అయితే ఇంతలో ఆయనకు పెద్ద చిక్కొచ్చిపడిందని అంటున్నారు అక్కడి నాయకులు. ధర్మవరం నుంచి 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ఓడిన వెంటనే బీజేపీలోకి చేరిపోయారు. సూరి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ధర్మవరంలో గెలిచారు. ఆయనకు అక్కడ పట్టు ఉంది. ఇక ఇపుడు చూస్తే సూరి మళ్ళీ టీడీపీలోకి చేరడానికి ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. సూరికి ధర్మవరంలో ఉన్న పట్టుని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలని అధినాయకత్వం అనుకుంటోందని టాక్. అదే జరిగితే ధర్మవరం నియోజకవర్గాన్ని నాలుగేళ్ల పాటు ఇంచార్జిగా చూసిన పరిటాల శ్రీరాం సంగతి ఏంటి అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది. రాప్తాడులో ఈసారి పరిటాల సునీత పోటీ చేస్తారు. దాంతో శ్రీరాం కి ధర్మవరం అని అనుకున్నారు.కానీ టిడిపి అధిష్టానం ఓ కండీషన్ పెట్టింది. కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికే టికెట్ అంటూ.. ఓ ప్రకటన కూడా చేసింది.మరి దీనిని బట్టి చూస్తే.. పరిటాల కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికే టికెట్ దక్కే అవకాశం ఉంది. అయితే శ్రీరామ్ మీద ఇప్పటికి అనేక భూ కబ్జా ఆరోపణలు, కేసులు ఉన్నాయి. దీని వల్ల ఆయనకు కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని, దీనివల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని అక్కడి నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. మరి వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ కి టికెట్ దక్కుతుందో లేదో చూడాలి.