అవును మీరు విన్నది అక్షరాలా నిజం. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. గుజరాత్ లోని సూరత్ కోర్టు ఈ శిక్ష విధించింది. మోడీని విమర్శించినందుకు దాఖలైన పరువు నష్టం పిటీషన్ పై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2019 ఏప్రిల్ నెలలో యూపీలోని కరోల్ లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ కొన్ని దారుణ వ్యాఖ్యలు చేశారు. అందులో ‘దొంగలంతా మోడీ ఇంటిపేరుతోనే ఉంటారెందుకో’ అంటూ నీరవ్ మోడీ లలిత్ మోడీ కేసును ఉదాహరణ తీసుకొని నోరుజారారు. మోదీ ఇంటిపేరుపై చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీపై పరువునష్టం కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ పరువు నష్టం కేసులో గురువారం కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నేపధ్యంలోనే.. IPC సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించారు. ఈ సెక్షన్ ప్రకారం గరిష్టంగా రెండేళ్ల శిక్ష విధించబడుతుంది. కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండేళ్ల జైలు శిక్షతోపాటు 15వేల జరిమానా విధించింది. బీజేపీ ఎమ్మెల్యే గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ చేసిన ఫిర్యాదుపై కోర్టులో విచారణ జరిగి రాహుల్ కు ఈ శిక్ష పడింది. అనంతరం రాహుల్ అభ్యర్థనపై బెయిల్ మంజూరు చేశారు. దీంతో ప్రస్తుతానికి తాత్కాలిక ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. న్యాయపరంగా పోరాడుతానని పేర్కొన్నారు. తీర్పు వెలువడిన వెంటనే రాహుల్ గాంధీ ట్విట్టర్లో మహాత్మా గాంధీని ఉటంకించారు. “నా మతం సత్యం అహింసపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు దానిని పొందేందుకు అహింస మార్గం”లో నడుస్తాను అని రాశారు.