బాబుకి షాకిచ్చిన టీడీపీ నేత ఓటుకి నోటు పార్ట్ -2

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినప్పటికీ.. ఆ హీటు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికలతో ఏపీ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్ధిని గెలిపించుకోవడం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. ఇక వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను కొని తమ అభ్యర్ధికి ఓటు వేయించుకున్నారని.. వారిపై వైసీపీ అధిష్టానం వేటు కూడా వేసింది. ఇక ఈ తరుణంలోనే టిడిపి రెబల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి సంచలన ఆరోపణలు చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, కొందరు టిడిపి నాయకులు స్వయంగా తనను కలిశారని, ఆ పార్టీలోని పెద్దలు తనకు ఫోన్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను ఫోన్ కూడా ఎత్తలేదని అన్నారు. కావాలంటే తన కాల్ డేటా చూడాలంటూ మీడియాకు చూపించారు. పేపర్‌ను మీడియా ముందుపెట్టిన మద్దాలి గిరి.. ఈ నెంబర్ ఎవరిదో చూస్తే మీకే అర్థమవుతుందని అన్నారు. టీడీపీ సంప్రదించిన వారికి వత్తాసు పలికే పరిస్థితి లేదని చెప్పారు. తాను ఆ పార్టీకి దూరం జరిగి మూడు సంవత్సరాలు మూడు నెలల అయిందని.. డబ్బులకు అమ్ముడుపోయే నీచమైన రాజకీయాలు చేయలేదని చెప్పారు. తమ మీద నిందలు వేస్తున్నారనే తాను ఈ విషయాన్ని చెబుతున్నానని చెప్పారు. చంద్రబాబు అడ్డదారిలో ఎలా అధికారంలో వచ్చారనేది అందరికీ తెలుసునని అన్నారు. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక్కొక్కరికి 15 నుంచి 20 కోట్ల వరకూ డబ్బులు ఇచ్చారని మద్దాలి గిరి ఆరోపణలు చేశారు.

అయితే.. చంద్రబాబు తనకు గౌరవం ఇవ్వకపోవడంతోనే టీడీపీని వీడానని చెప్పారు. జగన్‌పై అభిమానంతోనే తాము వైసీపీలో చేరామని తెలిపారు. టీడీపీ పతనం కావడానికి లోకేషే కారణమని ఆరోపించారు. తాను తన వాళ్లు అనే నైజం చంద్రబాబుదని విమర్శించారు. అమరావతి ఉద్యమం కోసం శ్రీదేవి పోరాడతానని అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పూటకొక మాట మారిస్తే ప్రజల విశ్వాసం కోల్పోతారని మద్దాల గిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.