ఎమ్మెల్యేలకు డెడ్ లైన్ ఢిల్లీలో ఉండగానే సీఎం జగన్ కన్ఫామ్

ఢిల్లీ టూర్ లో ఉండగానే సిఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 3వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో సిఎం జగన్ భేటీకానున్నారు.
తాజా ఎమ్మెల్సీ ఫలితాలు, తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా గడప గడపకు మన ప్రభుత్వంపై.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇన్నాళ్లు జరిగిన కార్యక్రమాలు, ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ సమీక్షించనున్నారు. గత సమావేశంలో.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాలని సిఎం జగన్ ఆదేశించారు. దీంతో ఈసారి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకూ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తక్కువ రోజులు పాల్గొన్నారని, రానున్న రోజుల్లో వారు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎవరూ అలక్ష్యం చేయొద్దని.. మార్చి నాటికి పూర్తిస్థాయి నివేదికలు తెప్పిస్తానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి 3 నెలల గడిచింది. దీంతో ఇప్పుడు ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న దానిపై జగన్‌కు పూర్తి స్థాయి నివేదకలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈసారి ఏ ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఇక వచ్చే ఎన్నికలకు ఎలా సిద్దం కావాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలలో చర్చలు వస్తున్నాయి. చూడాలి మరి ఏప్రిల్ 3న సిఎం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది.