టీడీపీలో అంతర్గత పోరు బహిర్గతం అవుతున్నాయి. తమలో తమకే పొసగక.. నాయకులు నానా రచ్చ చేస్తున్నారు. దేవినేని ఉమాకి సొంత నాయకుల నుంచే వ్యతిరేకత ఎదురవుతుంది. ఈసారి ఆయనను గెలిపించడం కుదరదని తేల్చి చెప్పేశారు… బొమ్మసాని సుబ్బారావు. ఈయన మరెవరో కాదు.. క్రిష్ణా జిల్లా టీడీపీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్. రెండు సార్లు దేవినేని ఉమాను గెలిపించానని నెక్స్ట్ ఆ ఛాన్స్ లేదని, మూట ముల్లె సర్దుకోవడమేనని ఉమాకి షాక్ ఇచ్చారు. అసలు ఉమాకి ఇంతటి వ్యతిరేకతను మూటకట్టుకోడానికి గల కారణాలు ఏంటి..? ఆధిపత్య పోరు కోసం నాయకులను దేవినేని ఉమా పట్టి౦చుకోవట్లేదా..? మంత్రిగా ఉన్న టైం లో క్రిష్ణా జిల్లాలో ఉన్న పార్టీ నేతలతో పెద్దగా రిలేషన్స్ పెంచుకోలేకపోయారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇక.. ఈ నేపధ్యంలోనే బొమ్మసాని సుబ్బారావు నేరుగా బయటకొచ్చి.. తన మనసులో మాట చెప్తున్నారు.
తాను గత ఎన్నికల్లో ఉమా గెలుపు కోసం పనిచేశానని ఆ విధంగా తాను ఈసారి పోటీ చేయాలని కోరుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదని ఆయన అంటున్నారు. పైగా ఇది న్యాయం, ధర్మమని చెబుతున్నారు. బొమ్మసాని సుబ్బారావుకు టీడీపీ నేతల నుంచి మద్దతు కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు మైలవరంలో పట్టు ఉంది. పైగా ఎంపీ కేశినేని నానికి కూడా ఉమా అంటే పీకలదాకా ఉందని గుసగుసలు వచ్చాయి. ఆ మధ్య నాని కూడా ఉమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఈసారి దేవినేని ఉమాకు టికెట్ ఇస్తే సొంత వారు సహకరించరని పైగా ఆయన ఓడిపోతారని కూడా అంటున్నారు. డీపీ అధినాయకత్వం కూడా దేవినేని ఉమాకు మైలవరం నుంచి తప్పించి వేరే సీటుని ఇవ్వాలని చూస్తోందని అంటున్నారు. అయితే దానికి ఉమా నో చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే కీలకమైన నియోజకవర్గం మైలవరం ఒకటి. వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తానని ఉమా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఆ మేరకు ఆయన ఇప్పటికీ నియోజకవర్గ పనులలో బిజీ అయ్యారు. కానీ బొమ్మసాని సుబ్బారావు చేసిన ఈ వ్యాఖ్యలు టిడిపి లో పెను దుమారం రేపాయి. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఉమా ఎలా రియాక్ట్ అవుతారో అన్నది కూడా చూడాలి.