ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో 61 చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మహిళా-శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్–1 సూపర్‌వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటినీ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన నియామక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారు. అయితే.. జగన్ ప్రభుత్వంలో అంగన్వాడీ వ్యవస్థలో అనేక మార్పులు నెలకొన్నాయి. అంగన్వాడీ వ్యవస్థపై స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ అంగన్వాడీ వ్యవస్థ నెంబర్ వన్ గా ఉందని..గత నెలలో కేంద్ర మంత్రులు వెల్లడించారు.