“సీట్ల కుస్తీ” ఉత్తరాంధ్రలో బాబుకి గుణపాఠం వైసీపీకే పీఠం

టీడీపీని గాడిలో పెట్టాల్సిన సీనియర్ నాయకులే గ్రూపు రాజకీయాలతో పార్టీని అస్తవ్యస్తం చేస్తున్నారా..? ఆధిపత్యం కోసం సతెలుగు తమ్ముళ్ళు నానా హైరానా పడుతున్నారా..? ఎన్నికల్లో తమ వారసులకే టిక్కెట్లు దక్కాలని సీనియర్లు బాబును డిమాండ్ చేస్తున్నారా..? సీటు కోసం ఇప్పటి నుంచే కుస్తీలు పడుతున్నారా..? సీనియర్లకు తమలో తమకే ఒకరంటే ఒకరికి పొసగటంలేదా..? నువ్వా నేనా అంటూ పంతాలకు పోయి.. చివరికి బాబు సీటుకి ఎసరు పెట్టాలనుకుంటున్నారా..? అంటే.. ప్రస్తుతం టిడిపి సీనియర్ల వ్యవహార శైలి, వారి వింత పోకడలు అలానే ఉన్నాయని చాలా క్లియర్ గా బహిర్గతం అవుతోందని చెప్పాలి. ఓ వైపు లోకేష్ పాదయాత్ర, మరో వైపు బాబు జిల్లాల యాత్ర చేస్తూ.. పార్టీని ముందుకు తీసుకెళ్దామని ఎంతలా ట్రై చేసినా.. క్యాడర్ మాత్రం అందుకు రివర్స్ లో వెళ్తున్నారు. పైకి మాత్రం తమ నాయకుల వెంటే ఉంటూ.. వెనక భారీ ఎత్తున గోతులు తవ్వుతున్నారని తెగ ప్రచారం అవుతోంది. ఇక అసలు విషయానికొస్తే.. చంద్రబాబు రేపటి నుంచి ఉత్తరాంధ్ర పర్యటన చేయబోతున్నారు. రేపు చంద్రబాబు విశాఖ పర్యటన నేపథ్యంలో.. విభేదాలు భగ్గుమన్నాయి. బాబు విశాఖ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వెల్లగక్కారు. అసలే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతుంది. వీరి వైరం ఇప్పటిది కాదు. ఈ క్రమంలోనే అలిగిన అయ్యన్న.. చంద్రబాబు సభకు దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న బీసీ కార్యక్రమానికి సైతం అయ్యన్న డుమ్మా కొట్టారు. ప్రస్తుతం ఇదే పార్టీలో ఇదే చర్చ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయ్ కి టికెట్ ఇవ్వాలని కూడా అయ్యన్నపాత్రుడు పట్టు పట్టి మరీ కూర్చున్నారట. ప్రస్తుతం విశాఖలో గంటా అన్నీ తానై చూసుకుంటున్నారు. ఇది అయ్యన్నకు అస్సలు మింగుడు పడటంలేదని లోకల్ టాక్.

మరోవైపు పాయకరావుపేట టీడీపీలోనూ వర్గ విభేదాలు తారాస్తాయికి చేరాయి. వంగలపూడి అనితకు టీడీపీలో ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. ఆమె టిడిపి ఫైర్ బ్రాండ్ అని అంటూ ఉంటారు. అయితే ఆమెకు పెద్ద చిక్కొచ్చిపడింది. అనితకు వ్యతిరేకంగా పార్టీలో ఓ వర్గం సమావేశం అయినట్లు సమాచారం. ఆమె అనుమతి లేకుండా నియోజకవర్గంలో కొన్ని పనులు కూడా జరిగిపోతున్నాయట. ఇలా ఉత్తరాంధ్రలో టిడిపిలో వర్గపోరుతో చాలా మంది నాయకులు ఎడమొహం పెడమొహం గా ఉన్నారనేది ప్రచారం. 1983లో వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర కంచుకోటగా మారింది. కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరిపోయారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఉత్తరాంధ్రలో మాత్రం తెలుగుదేశం పార్టీ హవా ఉండేది. ఈ ప్రాంతపు బీసీల్లో తెలుగుదేశానికి మంచి పట్టు ఉంది. అయితే ప్రస్తుతం టీడీపీ ఈ ప్రాంతంలో ప్రాభవం కోల్పోతోంది.అయితే.. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలకు కేవలం 6 సీట్లే టీడీపీ గెల్చుకుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. చూడాలి మరి ఈసారి ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది.