వచ్చే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి.
వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ పదేపదే చెప్తున్నారు. అయితే అది ఎంతమేరకు సాధ్యం అవుతుంది..? దానికి టిడిపి సీనియర్లు ఒకే అంటారా..? లేదంటే తమ స్థానం తమకే కావాలంటారా..? అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. పవన్ నిన్నటి ఢిల్లీ పర్యటనలో కూడా అదే చెప్పుకొచ్చారు.
ఇక అసలు విషయానికొస్తే.. ఏపీలో పొత్తుల కధ కాస్తా ముందుకు జరిగి అభ్యర్ధుల ఖరారు దాకా వస్తోంది. సీట్లు ఎన్ని ఇస్తారు అన్నది మెల్లగా మబ్బులు వీడుతూ కీలక స్థానాలలో పోటీ చేసే వారి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. జనసేన – టిడిపి పొత్తులు కుదిరితే.. విశాఖ ఎంపీ స్థానాన్ని జనసేనకే కేటాయించాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పొత్తుల రూట్ క్లియర్ అవ్వకపోతే.. ఎవరిదారి వారిదే. కానీ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని పదేపదే చెప్తున్న పవన్ పరువు పోవడం ఖయ౦. ఈ క్రమంలోనే బాలక్రిష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ చేసిన వ్యాఖ్యలు.. ఈ వార్తలకు తావిస్తున్నాయి. విశాఖ ఎంపీగా ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కచ్చితంగా పార్లమెంట్ లో కూర్చోవాలని భరత్ పట్టుదలగా ఉన్నారు. తనకు పార్టీ నూరు శాతం టికెట్ ఇస్తుందని కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనకు ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధపడిందని అంటున్నారు. ఇక విశాఖ ఎంపీ సీటుని కూడా.. జనసేనకే ఇచ్చే అవకాశం ఉన్న తరుణంలో.. భరత్ ఈ వ్యాఖ్యలు చేయడం విశాఖ రాజకీయాలలో సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో నాగబాబుని విశాఖ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా విశాఖ నుంచే ఎంపీగా భరిలోకి దిగుతానని అంటున్నారు.. కానీ ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు అనేది మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణ కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈయనకు సీటు దక్కే ఛాన్స్ లేదని కూడా ప్రచారం అవుతోంది. ఫైనల్ గా చూస్తే.. విశాఖ నుంచి ఏకంగా నలుగురు పోటీ పడుతున్నారు. ఒకవేళ పొత్తులు కుదిరితే.. విశాఖ ఎంపీ స్థానాన్ని టిడిపి త్యాగం చేసుకుంటుందో లేదో చూడాలి. అలా త్యాగం చేస్తే విశాఖలో త్రిముఖ పోరు నడుస్తోందనే చెప్పాలి. చూడాలి మరి ఎం జరగబోతుందో అనేది.