సంకల్ప సిద్ది కేసులో కీలక పురోగతి పట్టాభిపై చర్యలు

విజయవాడలో సంచలనం సృష్టించిన సంకల్ప సిద్ది కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసు వ్యవహారంలో 4 నెలల క్రితమే చైర్మన్ గోపాలకృష్ణ సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యారు. సంకల్ప సిద్ది కేసులో కీలక నిందితుడిగా ఉన్న డైరెక్టర్ గుత్తా కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు బెజవాడ పోలీసులు. చైర్మన్ గుత్తా గోపాలకృష్ణ తర్వాత మొత్తం వ్యవవహరం నడిపించాడు కిరణ్.
4 నెలల క్రితమే చైర్మన్ గోపాలకృష్ణ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కిరణ్ ను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. కిరణ్ కోసం గత కొన్ని నెలలుగా బెంగుళూరు, గోవా, బళ్ళారి లో గాలిస్తున్నారు బెజవాడ పోలీసులు. ఎట్టకేలకు నిన్న రాత్రి బెంగుళూరు లో కిరణ్ ని అదుపులోకి తీసుకుని బెజవాడ తీసుకువచ్చారు పోలీసులు. 200 కోట్లకు పైగా సంకల్ప సిద్ధిలో మోసం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. సంకల్ప సిద్ది కేసులో ఏ2 గా గుత్తా కిరణ్ ఉన్నాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక సహా మూడు రాష్ట్రాల్లో సంకల్ప సిద్ది మోసాలు బయటపడ్డాయి. 60 వేల మంది వరకు బాధితులు ఉన్నట్టు అంచనా వేశారు. ఇప్పటికే ఈ కేసులో 36 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇక ఇదే కేసుకు సంబందించి రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా సంబందం ఉంది అంటూ.. టీడీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబందం లేదంటూ.. గతంలోనే డీజీపీని కలిసి వివరణ కూడా ఇచ్చారు.
డీజీపీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సంకల్ప సిద్ధి కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండానే తనపై ఆరోపణలు చేశారని అన్నారు. ఈ విషయమై తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేత పట్టాభిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్టుగా ఆయన చెప్పారు. అంతేకాదు తనపై తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తున్నట్టుగా వంశీ తెలిపారు.

ఈ సంకల్ప సిద్ధి కుంభకోణం కలకలం రేపింది. దీని విలువ 1400 కోట్లు వరకూ ఉంటుందని భావిస్తున్నారు. భూముల్లో ఎర్రచందనం మొక్కలున్నాయంటూ తప్పుడు ఆశలు చూపించి మోసం చేశారు. ధనార్జనే ధ్యేయంగా అబద్ధాలతో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు.సంస్థ వసూలు చేసిన 1400 కోట్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ దర్యాప్తు సాగింది. ఈ కుంభకోణంలో మొత్తం 40 మందికి పైగా అనుమానితులను పోలీసులు విచారించారు. ఈ సంస్థ ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగాయనే దానిపై, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. గుత్తా కిరణ్ పట్టుబడడంతో అసలు విషయాలు బయటకు వస్తాయంటున్నారు.