ఏపీ రాజధాని వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ..వికేంద్రీకరణకు జగన్ సర్కార్ కట్టుబడి ఉంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే ఎవరి డిమాండ్లు వారివి. అయితే.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది.
అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయాలను పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. తక్షణ నిధులను మంజూరు చేసింది. దీంతోపాటు విశాఖలో పలు ప్రభుత్వ భవనాల కట్టడాలకు కేంద్రం తాజాగా నిధులు మంజూరు చేసింది. అమరావతిలో నిర్మించతలపెట్టిన కేంద్రీయ సచివాలయం అంచనా వ్యయాన్ని 1,500 కోట్లకు పెంచింది. తక్షణమే కోటి కేటాయించింది. గతేడాది ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,244 కోట్లుగా ఉంది. 2023-24 బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులను ఆయా అవసరాల కోసం కేటాయిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమగ్ర పద్దుల వివరాలను విడుదల చేసింది.
విశాఖ కేంద్రంగా సాగుతున్న నిర్మాణాలకు కేంద్రం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 46 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ డాబాగార్డెన్స్‌లో ఆదాయపు పన్ను శాఖ నూతన భవన నిర్మాణానికి, 18 కోట్ల వ్యయంతో విశాఖలో కేంద్ర జీఎస్టీ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాని కోటి చొప్పున, విశాఖలో 10 కోట్ల వ్యయంతో జనరల్ పూల్ ఆఫీస్ అకామడేషన్ నిర్మాణానికి 50 లక్షలు, అందుకు 5 కోట్లతో భూమి కొనుగోలుకు లక్ష కేటాయించింది. ఇలా విశాఖకు కూడా కేంద్రం నిధులు కేటాయించడంతో మూడురాజధానుల విషయం మరింత ఆసక్తికరంగా మారింది.మరి రాజధానితుది తీర్పు ఎప్పుడు వెలువడనుందో వేచి చూడాలి.