గుడివాడ టూర్ తమ్ముళపై బాబు ఫైర్…

వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలలో టిడిపి జెండా ఎగరవేయాలని చంద్రబాబు టార్గెట్ పెట్టుకున్నారు. అందులో మొదటిది.. కొడాలి నాని నియోజకవర్గం గుడివాడ. ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని.. బాబు ఎన్నో రకాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొడాలి నాని నియోజకవర్గంలో ఎందుకు బలంగా ఉన్నారు? ఆయన బలాలు ఏమిటి? బలహీనతలు ఏంటి..? గుడివాడలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి..? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవాలంటే ఎటువంటి ప్రణాళిక రచించుకోవాలి..? చంద్రబాబు కాలుకి బలపం కట్టుకొని తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా గన్నవరం నియోజకవర్గంలో తమ్ముళ్ళు తన్నుకున్నారు. నియోజకవర్గ పరిదిలో పార్టీ కార్యకలాపాలకి సొంత పార్టీ నాయకులను కూడా పిలవకుండా.. తమను దూరం పెడుతున్నారని హనుమాన్ జంక్షన్ లో గల్లాపట్టి మరీ కొట్టుకున్నారు. ఈ ఘటనపై తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్ కూడా అయ్యారట. పార్టీని గాడిలో పెట్టాల్సిన నాయకులే ఇలా తన్నుకోవడం పార్టీ పరువును బజారుకి ఈడ్చడమే అంటున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. తన పర్యటనలో భాగంగా 13వ తేదీన గుడివాడకు రానున్నారు. ఈ సందర్భంగా అక్కడ బహిరంగసభను నిర్వహించేలా తెలుగు తమ్ముళ్లు ప్రణాళిక రచించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలనే పట్టుదలతో వారున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవడంకన్నా వారికి మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించడమే ప్రత్యేక లక్ష్యంగా మారింది.

ఏడాది ముందుగానే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోన్న చంద్రబాబు కీలకమైన గుడివాడ, గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో ఏం చేయబోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. కనీసం 6నెలల ముందుగానైనా గుడివాడ నుంచి పోటీచేసేవారిని ప్రకటిస్తే పోరాడటానికి వీలవుతుందని, అలా కాకుండా చివరి నిముషంలో ప్రకటిస్తే ఈసారి కూడా కొడాలి నాని గెలుపును అడ్డుకోలేమని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. గుడివాడ విషయంలో చంద్రబాబు ఎటువంటి వ్యూహాన్ని అవలంబిస్తారో వేచి చూడాల్సి ఉంది.