టీడీపీ నాయకుల హైడ్రామా చొక్కాలు చింపుకొని మరీ

రాష్ట్రంలో టిడిపి అల్లర్లు చేయాలని నిర్ణయించుకుందా..? అభివృద్దిపై చర్చ అంటూ సవాళ్ళు చేస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాత౦ కలిగిస్తున్నారా..? రాష్ట్రవ్యాప్తంగా తరచూ అధికార పార్టీపై టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారా..? అభివృద్దిపై చర్చ అంటూ.. రాష్ట్రంలో రచ్చ చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు తరచూ అధికార పక్షంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా అమరావతిలోనూ టిడిపి హై డ్రామా సృష్టించింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావుపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అభివృద్దిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించి.. తన బలగంతో అమరేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. టిడిపి నాయకులు భారీగా మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది దీంతో పోలీసులు అప్రమత్తమై కొమ్మాలపాటిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ మూకలు రెచ్చిపోయి బస్సుపై దాడి చేశారు. పోలీసులు వెంటనే ఇరుపార్టీల వారిని వెనక్కి పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇక ఇదే వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సవాల్ విసిరారు.
తనపై టీడీపీ నేతలు ఇటీవల కొన్నిరోజులుగా చేస్తున్న ఆరోపణలు, అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. తాను దైవ సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమని కూడా ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో అమరవాతి ప్రాంతంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. అయితే టిడిపి నాయకులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి గోడవలకు దిగారు. పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్న నేపధ్యంలో పోలీసులకు సహకరించకుండా నానా యాగీ చేస్తూ.. తమ చొక్కాలు తామే చించుకునే యత్నం చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇలా చేయడం టిడిపికి కొత్తేమీ కాదు.. రాష్ట్ర అభివృద్దిపై చర్చ అంటూ.. స్వయంగా చంద్రబాబు, లోకేష్ లు కూడా అధికార పార్టీపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.