నందమూరి హరికృష్ణ కుమార్తె.. నందమూరి సుహాసినికి పార్టీలో కీలక పదవి లభించింది. ఏపీలో పాటు తెలంగాణలో తన ఉనికిని చాటుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్న టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్ర కమిటీ విస్తరణలో ముగ్గురికి స్థానం కల్పించారు.రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని నియమితులయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శిగా బీ విఠల్ నియమితులయ్యారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా షకీలా రెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కరాటే రమేష్ ను నియమిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. గత కొద్ది రోజుల క్రితం నందమూరి సుహాసిని ఏపీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. చిలకలూరిపేట నుంచి టిడిపి అభ్యర్ధిగా భరిలోకి దిగనున్నారని తెగ వార్తలు వచ్చాయి. గన్నవరం నియోజకవర్గం నుంచి కూడా సుహాసినిని భరిలోకి దించనున్నారని పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. గతంలో నందమూరి సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. మరి వచ్చే ఎన్నికల్లో ఆమె తెలంగాణకే పరిమితం అవుతారో లేక.. ఏపీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారో అనేది చూడాలి.