ఏపీ సీఎం జగన్ రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. మళ్ళీ అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ఆచి తూచి ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే… కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం వివాదానికి దారి తీసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేమని ఇప్పటికే 19 పార్టీలు స్పష్టం చేశాయి. రాష్ట్రపతి కాకుండా ప్రధాని ఎలా ప్రారంభోత్సవం చేస్తారని ఆ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
భవనాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం ప్రజాస్వామ్యంపై దాడి అని విమర్శిస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలోనే సిఎం జగన్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాలలోనే కాదు యావత్ దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ కి తాను వెళ్తున్నట్లు స్వయంగా సిఎం జగన్ ప్రకటించడం ఆసక్తిగా మారింది.
కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేస్తున్న ప్రధాని మోదీకి జగన్ అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంట్ మన దేశ ఆత్మను ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ భవనం దేశ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినదని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఈ అద్భుత కార్యక్రమంలో అన్ని పార్టీలు పాల్గొనాలని కోరుతున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంపై ఉన్న నిజమైన స్ఫూర్తితో తమ పార్టీ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొంటుందని చెప్పారు.సీఎం జగన్ కు కేంద్రంలోని ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్దికంగా కేంద్రం నుంచి తోడ్పాటు అందుతోంది. మరోవైపు సిఎం జగన కూడా మోడీకి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వానికి కేంద్రం వెయ్యికోట్లు పెండింగ్ నిధులను విడుదల చేసి భారీ ఉపశమనం చేకూర్చింది. ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన ప్రయత్నం చేస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని పవన్ చెబుతున్నారు. ఈ సమయంలో జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ, ఇప్పుడు టీడీపీతో కలుస్తుందా లేదా అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. మరి కొత్త పార్లమెంట్ భవన౦ ప్రారంభోత్సవానికి టిడిపి కి కూడా ఆహ్వానం వెళ్ళిందని అంటున్నారు. మరి అదే రోజు రాజమండ్రిలో టిడిపి మహానాడు కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. మరి ఈ పార్లమెంట్ ఓపెనింగ్ కి చంద్రబాబు వెళ్తారా లేక డుమ్మా కోడతారా అన్నదే చూడాలి.