ఏపీలో పొత్తుల రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన పొత్తులలో భాగంగా రెండు పార్టీలలో ఆశావాహులు తమ సీట్లు ఖరారు చేసుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఇప్పటికే జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కు టీడీపీ షాక్ ఇస్తే.. . టీడీపీ నేత లోకేష్ కు పోటీగా కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చింది. జనసేనాని పవన్ ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి ద్వారా ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. ముందుగా గోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. ఇదే సమయంలో రెండు పార్టీల నుంచి అసెంబ్లీ పోటీ ఆశావాహుల తమ సీట్ల కోసం ప్రకటనలు చేస్తున్నారు. సీట్లు తమకే ఇవ్వాలని డిమాండ్లు మొదలు పెట్టారు.నారా లోకేశ్ 2024 ఎన్నికల్లో తిరిగి మంగళగిరి నుంచి పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ముందునుంచి అక్కడ పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనికి కౌంటర్ గా వైసీపీ అక్కడ చేనేత వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ మాజీ మంత్రి మురుగుడుకు ఎమ్మెల్సీ పదవి.. టీడీపీ మాజీ నేత గంజి చిరంజీవికి చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టింది.
లోకేష్ ఈ సారి తన గెలుపు పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మంగళగిరి సీటు తమ పార్టీకే ఇవ్వాలని జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాస రావు డిమాండ్ చేశాడు. తాను మొదటి నుంచి ఇదే అడుగుతున్నానని చెప్పారు. నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం వారు బలంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని మొదటి నుంచి ఆశిస్తున్నట్లు చిల్లపల్లి వెల్లడించారు. ఒకవేళ పార్టీకి టికెట్ ను కేటాయించని పక్షంలో భవిష్యత్తు పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటానని అల్టిమేటం జారీ చేసారు. ఆ తర్వాత మేయర్ టిక్కెట్ కూడా ఇవ్వాలని అభ్యర్థిస్తామని తెలిపారు. ఇప్పటికే ఇదే జిల్లాలో తెనాలి సీటు పైన నాదెండ్ల మనోహర్ ఆశలు పెట్టుకున్నారు.