రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో గర్భిణులకు ఆల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందించబోతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ లను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో … ఆ సేవలను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లాంఛనంగా ప్రారంభించారు.
ఎంతో ఖరీదైన ఈ సేవలను ఇప్పటివరకు రోగులు డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తుందని మంత్రి రజనీ తెలిపారు. ఏటా 64వేల మందికిపైగా టిఫా స్కానింగ్ అవసరం ఉంటుందని భావిస్తున్నామని, అందుకు దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఇకపై ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాన్పులకు ఆరోగ్యశ్రీ వర్తించేది కాదని, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా కాన్పులు చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు డాక్టర్ సిఫార్సు చేసే అందరికీ టిఫా స్కానింగ్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తారని చెప్పారు.టిఫా స్కానింగ్ కోసం ఒక్కొకరికి రూ.3వేలకుపైగా ఖర్చవుతుందని మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు. పేద గర్భిణి లకు ఇకపై ప్రభుత్వమే ఉచితంగా చేస్తుందన్నారు. ఈ టిఫా స్కానింగ్ ద్వారా జన్యు లోపాలు, శిశువు అవయవలోపాలు, పిండంలో లోపాలు, పిండం ఎదుగుదుల వంటి వాటిని పూర్తి స్థాయిలో ముందే తెలుస్తుందన్నారు. పిండం ఎదుగుదలలో ఏవైనా అనుమానాలున్నా, గర్భిణిల కుటుంబ నేపథ్యం, వారి మెడికల్ హిస్టరీ.. ఇలా పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ టిఫా స్కానింగ్ ను వైద్యులు సిఫారసు చేస్తారన్నారు. అల్ట్రా స్కానింగ్ ప్రతి గర్భిణికి రెండు సార్లు చేయాల్సిన అవసరం ఉంటుందని, ఈ స్కానింగ్‌లను కూడా పూర్తి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందించేలా జగనన్న నిర్ణయం తీసుకున్నారనన్నారు.