నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నట్టు లేదు.. కేవలం విమర్శల కోసం పని కట్టుకొని తిరుగుతున్నట్టు ఉంది. లోకేష్ ఏ నియోజకవర్గం వెళ్ళినా.. ఒకటే పాట పాడుతున్నారు. భూ కబ్జా, ఇసుక దోపిడీ, అక్రమ రవాణా, ఇలా ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలపై బూరదజల్లటమే తప్ప..తాము అధికారంలోకి వస్తే.. ప్రజలకు ఎం చేస్తారో మాత్రం చెప్పిన దాఖలాలు లేవు. తాజాగా రాయలసీమలో యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సీమలో మంటపుట్టించాయి. వైసీపీ ఎమ్మెల్యేల్ని టార్గెట్ చేస్తూ రాయలసీమలో యాత్ర సాగించిన లోకేష్.. చివర్లో తానూ రాయలసీమ వాసినేనంటూ, సీమకి సీఎం ద్రోహం చేశారంటూ పలు రకాల విమర్శలు చేశారు. ఈ నేపధ్యంలోనే.. లోకేష్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు గుర్తుకు రాని రాయలసీమ ఇప్పుడే గుర్తు కొచ్చిందా అని లోకేష్ ను అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. లోకేష్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప లోకేష్ కు తాను ఈ ప్రాంత వాసినని తెలీదా..? అని ప్రశ్నించారు. తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకుని అధికార పార్టీపై లోకేష్ అబద్ధాలు, అసత్యాలు చెబుతున్నాడని అవినాష్ విమర్శించారు. ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు.. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఎంపీ అవినాష్ పేర్కొన్నారు. ఇక ఈ నేపధ్యంలోనే లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. నెల్లూరు రాజకీయాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. నెల్లూరులో రాజకీయాలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఇదే క్రమంలో లోకేష్ పాదయాత్ర నెల్లూరుకి ప్రవేశించడంతో.. ఉత్కంఠను రేకెత్తిస్తుంది. మరి టిడిపి లో చేరడానికి సిద్దంగా ఉన్న.. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెలులు లోకేష్ సమక్షంలో టిడిపి కండువా కప్పుకుంటారో లేదో అనేది చూడాలి.