ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఉత్కంఠభరితంగా మారిన అంశం మూడురాజధానులు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో కొనసాగుతుంది. ఏపీకి రాజధాని ఏది ఫైనల్ గా ఉండబోతుంది..? సుప్రీం ఏం చెబుతుంది? రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టుగా.. పాలనారాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని అంగీకరిస్తుందా? లేక.. అమరావతికే మొత్తంగా మొగ్గు చూపుతుందా? అనేది ఆసక్తిగా మారింది.ఈ నేపధ్యంలోనే.. సిఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని అవుతుందని.. తాను అక్కడే పరిపాలిస్తానని.. త్వరలోనే అక్కడకు షిప్ట్ అవుతానని సీఎం జగన్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని తరలింపునకు సిద్ధమవుతోందనడానికి ఇది నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. చెప్పడమే కాదు.. వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకోవడం విశేషం. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు కూడా స్టార్ట్ చేశారు. విశాఖ రాజధాని అవుతుందని ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడంతో ఇక దాదాపు విశాఖ రాజధాని అవుతుందని వైసీపీ లో కొత్త ఆశలు చిగురించాయి.
మేము రాజధానిని విశాఖపట్నంకు మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏప్రిల్లోపు అక్కడి నుండి పరిపాలనా కార్యకలాపాలను ప్రారంభిస్తామని తాజాగా వైవీ సుబ్బారెడ్డి కూడా మీడియా పూర్వకంగా వెల్లడించారు. అయితే.. ఈ రాజధానుల విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటేనే మూడు రాజధానులకు లైన్ క్లియర్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే.. మూడు రాజధానుల కేసు షెడ్యూల్ ప్రకారం జనవరి 31న దీనిపై విచారణ జరగాల్సి ఉంది. తీరా చూస్తే.. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకే రాలేదు. అసలు ఎప్పుడు విచారణకు తీసుకుంటారో కూడా స్పష్టత రాకపోవడం గమనార్హం. మరో వైపు చూస్తుంటే.. కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం.. సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందని అంటున్నారు. రాజధాని అంశంపైన సుప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందన్న నమ్మకంతో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే స్వయంగా సీఎం జగన్ రాజధానిపై ఇంత బహిరంగ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చివరకు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో అనేది చూడాలి.