జగన్ చేతిలో సర్వే నివేదిక ఆ 18 మంది ఎమ్మెల్యేలకు షాక్ పెద్ద బాంబ్ పేల్చిన సీఎం

ఎమ్మెల్యేల పని తీరు బాగుంటేనే నెక్స్ట్ ఎన్నికలకు టికెట్ అని సిఎం జగన్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. ఇక నేడు తాజాగా జరిగిన ఎమ్మెల్యేల రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు గడప గడపకు మన ప్రభుత్వంపై తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వంపై సిద్దం చేసిన సర్వే ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా 18 మంది ఎమ్మెల్యేలు గడప గడపకు తిరగలేదని సీఎం జగన్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. వచ్చే సమీక్ష నాటికి వారు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆ 18 మంది ఎమ్మెల్యేలను తాను పిలిచి మాట్లాడతానని అన్నట్టుగా సమాచారం. ఇక నుంచి అయినా బాగా తిరగాలని సూచించారు. గడప గడపలో గ్రాఫ్‌ పెరిగితేనే టికెట్లు అని సీఎం జగన్ స్పష్టం చేసినట్టుగా పలు న్యూస్ చానల్స్ రిపోర్టు చేశాయి. అయితే గడప గడపకు కార్యక్రమంలో పనితీరు కనబరచని ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే.. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా తీసుకొస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం గురించి ఈ సందర్భంగా సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దాదాపు నెలపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా చెప్పారు.