జగనన్నకు చెబుదాం

త్వరలోనే వైఎస్ జగన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమం రూపొందించబడింది.

‘జగనన్నకు చెబుదాం ’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సీఎంవో సహా అన్ని శాఖల్లో పర్యవేక్షణ వ్యవస్థను సిద్ధం చేయాలని వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

ఈ కొత్త కార్యక్రమంపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో అధికారులకు వివరించడమే కాకుండా ఫిర్యాదుల రూపంలో వచ్చిన ప్రతి వినతి, ఫిర్యాదులు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఫాలోఅప్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, అంతే కాకుండా ప్రతి వారం ఆడిట్ కూడా నిర్వహించాలని సీఎం సూచించారు.

ప్రస్తుత ప్రభుత్వ కాల్ సెంటర్లను ఈ కార్యక్రమంతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ అన్నారు. సీఎంఓతో పాటు ప్రతి శాఖలో ‘జగనన్నకు చెబుదాం’ పథకానికి మానిటరింగ్ సెల్ ఉండాలన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రతి జిల్లా, మండలం, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పర్యవేక్షణ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ఇప్పటికే నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి కొనసాగింపుగా జగనన్నకు చెబుదాం ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల్లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఫిర్యాదును త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి అవసరమైతే వారికి శిక్షణ కూడా ఇవ్వాలన్నారు

సమస్య పరిష్కారమైన తర్వాత ఫిర్యాదు/అభ్యర్థన చేసిన ప్రతి వ్యక్తి నుంచి కూడా లేఖ తీసుకోవాలని జగన్ చెప్పారు. అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను కూడా చాలా జాగ్రత్తగా పరిష్కరించాలని జగన్ అన్నారు. మండల, మున్సిపల్ స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని.. అందులో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు ఉంటారని సీఎం చెప్పారు.