ఏపీలో మూడు రాజధానుల అంశం మరింత కాక రేపుతుంది. రాజదానుల అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉండగానే.. సీఏం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపధ్యంలోనే.. విశాఖ రాజధానిగా ఫిక్స్ అని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక ఈ నేపధ్యంలోనే సిఎం జగన్ విశాఖకు సిఫ్ట్ అయ్యేందుకు కూడా పనులు చక చక జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు సైతం బీచ్ రోడ్ లో ఇళ్ళు వెతుక్కునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఆఫీసులతో పాటు విభజన తర్వాత కూడా హైదరాబాద్ లోనే ఉండిపోయిన పలు కార్యాలయాల్ని విశాఖకు, కర్నూలుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటికే హెచ్చార్సీతో పాటు లోకాయుక్త వంటి కార్యాలయాలు హైదరాబాద్ నుంచి కర్నూలుకు మారిపోయాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి అమరావతికి రావాల్సిన ఓ కీలక ఆఫీసు ఇప్పుడు వైజాగ్ కు తరలిపోతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా పదేళ్లు రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో రాష్ట్ర ఆర్ధిక శాఖ నిర్వహించే సమావేశాలకు ఆర్బీఐ అధికారులు హాజరవుతున్నారు. దీంతో ఏపీకి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కేటాయించాలని వైసీపీ సర్కార్ ఎప్పటి నుంచో కోరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు కాబోయే రాజధాని వైజాగ్ లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సర్వం సిద్దమవుతోంది.విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం అధికారులు ఇప్పటికే స్ధలాల్ని, భవనాల్ని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం కావాలని ఆర్బీఐ కోరుతోంది. దీంతో రాష్ట్ర అధికారులు అలాంటి భవనం అన్వేషణలో ఉన్నారు. భవనం దొరికితే నెల రోజుల్లోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.