వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాపకింద నీరులా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. పార్టీలో ఉంటూ.. పార్టీకి మచ్చ తెచ్చే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని సీఎం జగన్ ఏనాడో చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సైతం వేటు వేయడానికి వెనుకాడట్లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏం జరిగిందో కూడా మనం చూశాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే సీనియర్లను సైతం సీఎం జగన్ పక్కనపెడుతున్నారు. రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఏం జగన్ పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి.. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేసే వారికే మళ్ళీ అవకాశం కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను దక్కించుకోవాలని శాయశక్తులా కృషి చేస్తున్నారు.
పార్టీలో ఉంటూ పార్టీకి ఏమాత్రం ఉపయోగం లేని వారిని కూడా ఆయన పక్కన పెడుతున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే.. పెందుర్తి నియోజకవర్గానికి చెందిన శరగడం చిన్న అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.సీఎం జగన్ ఆదేశాల మేరకు అతనిని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా అందిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు శరగడం చిన్న అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధ్యక్షులు వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఎవరైతే పార్టీలో క్రమశిక్షణ లేకుండా ఉంటూ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తారో వారు ఎవరైనా నిర్ధాక్షిణంగా పక్కన పెడతామని వైసీపీ ముఖ్య నాయకులు అంటున్నారు.