క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారు రైల్వే కోడూరు మండలం మాధవరంపోడు నందు క్షత్రియస్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలిండియా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ తల్లిదండ్రులు కేవలం తమ పిల్లల చదువుకునే ర్యాంకులు చూసి కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని, బాగా చదివి గొప్ప ఉద్యోగం సాధించుకొని ధనం సంపాదించాలని కోరుకుంటున్నారని, కానీ ఈ క్రమంలో తమ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రయత్నించడం లేదన్నారు.
విద్యతో పాటు క్రీడల వైపు విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా తల్లితండ్రులకి, ఉపాధ్యాయులకు ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఈ దిశగా మార్పు రావాలని, ప్రతి ఒక్క విద్యార్థి క్రీడలపట్ల ఆసక్తి చూపేలా వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, క్రీడల్లో పాల్గొనడం విద్యార్థుల దినచర్యలో ఒక భాగం కావాలన్నారు.