రాజకీయాలలో ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియాలంటే.. సమయం వచ్చే వరకు వేచి చూడాలి. ఎప్పుడూ నాదే పెత్తనం అనుకుంటే పొరపాటే. రాజకీయాలలో ఎప్పుడు ఎలాంటి మార్పులయినా జరగవచ్చని అంటున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మైలవరంలో బలమైన నాయకుడు అయినటువంటి దేవినేని ఉమాకి 2019 ఎన్నికల్లో ఓడించి.. వైసీపీ జెండాను ఎగురవేశారు. అయితే గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వసంత పార్టీ మారుతున్నారు అన్న ప్రచారంపై స్పందించారు. తాజాగా ఆయన సీఎం జగన్ తో కూడా భేటీ అయ్యారు. నా ప్రాణమున్నంతవరకు జగన్ తోనే ఉంటానని కూడా వివరించారు. వైఎస్సార్ కుటుంబానికి విశ్వాసంగానే ఉంటానని చెప్పారు.
ఈ నేపధ్యంలోనే ఎమ్మెల్యే వసంత దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా అసాంఘిక శక్తని.. ఏం చేసి దేవినేని ఉమా కోటీశ్వరుడయ్యారో చెప్పాలన్నారు. ఎన్నికల ముందు చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశారని.. ఉమా దోపిడీపై తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. 379 కోట్లు ఇరిగేషన్ పనులు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి దగ్గర 20 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఉమా గతంలో పాల్పడ్డ ఆక్రమాలన్నీ చంద్రబాబు వద్దకు చేరాయని. అందుకనే.. దేవినేని ఉమాకు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇచ్చే ఆలోచనలో లేరని ఎమ్మెల్యే వసంత పేర్కొన్నారు. ఇక దేవినేని ఉమా చేతికి చిప్పే అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడే వారికి టికెట్ ఇస్తే.. ఈసారి టీడీపీకి 23 కూడా రావని బాబుకు సూచించారు. మైలవరంలో తనకు ఎలాంటి గనులు లేవని.. మైలవరంలో ఉన్న గనులన్నీ టీడీపీకి చెందినవే అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే దేవినేని ఉమా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మైలవరంలో తనను ఓడిస్తానని 2019లో దేవినేని కూతలు కూశారని.. తన చేతిలో ఓడిపోయారని ఎమ్మెల్యే వసంత గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజారిటీతో మైలవరంలో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.