ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆస్ట్రేలియా లేబర్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల బృందం భేటీ అయింది. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏపీలో విద్య, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆస్ట్రేలియా ఎంపీలు ప్రశంసించారు. ఎనర్జీ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలపై సీఎం జగన్ సర్కార్ చూపిస్తున్న చొరవను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో సాధ్యమయ్యే అంశాల్లో సహకారాలు, శక్తి, విద్య, నైపుణ్యాల అభివృద్ధి రంగాల్లో సృష్టించగల సినర్జీలపై వరుస చర్చలు జరిగాయి.
సమావేశం అనంతరం ఎంపీ లీ టార్లామిస్ మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డితో జరిగిన చర్చలపై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇంధన రంగాల్లో విధానాల పరంగా తమకు చాలా సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఈ రంగాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చన్నారు. పునరుత్పాదక శక్తిపై కూడా తాము చర్చలు జరిపామని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సౌరశక్తి పరంగా చేపట్టిన ఆసక్తికరమైన కార్యక్రమాల గురించి తాను ఆసక్తిగా విన్నానని తెలిపారు. ఇక్కడ చేసిన అభివృద్ధి అభినందనీయమని లీ టార్లామిస్ అన్నారు.
ఆస్ట్రేలియా శాసనసభలో డిప్యూటీ స్పీకర్ మాథ్యూ ఫ్రెగాన్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమతో చాలా ఉదారంగా వ్యవహరించారని కొనియాడారు. ఇద్దరి భాగస్వామ్యం అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.