దేశంలోనే ఏపీ టాప్.. సీఎం జగన్‌ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతించకూడదు: మంత్రి గోపాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పారిశ్రామికంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు మంత్రి గోపాలకృష్ణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర జీఎస్‌డీపీ 11.34 శాతంగా ఉందని గుర్తు చేశారు. ఈ విషయంలో జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ చాలా ముందుందన్నారు. ప్రజల తలసరి ఆదాయం కూడా 38.5 శాతం మేరకు పెరిగిందని వివరించారు.

కొందరు రాష్ట్ర వృద్ధి తిరోగమనంలో ఉందని ప్రచారం చేస్తున్నారని.. అది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి గోపాలకృష్ణ స్పష్టం చేశారు. 2022 జూలై నాటికి ఏపీకి రూ. 40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా రూ.1.71 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే, అందులో అత్యధిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చాయని చెప్పారు.

ఇక, రూ. 23,985 కోట్లకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిందని మంత్రి గోపాలకృష్ణ తెలిపారు. పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ 5వ స్థానంలో ఉందన్నారు. అలయన్స్ టైర్స్ సంస్థ విశాఖపట్నంలో రూ.1,040 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై దేశీయ, విదేశీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉందని.. బల్క్ డ్రగ్ పార్క్ కోసం రూ.1,000 కోట్ల గ్రాంట్ ఏపీ సాధించిందన్నారు.

రాజధానిని చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టరని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ పరిపాలన చూసే పెట్టుబడులు వస్తాయన్నారు. రాజధానికి, పెట్టుబడులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో దావోస్‌కు వెళ్లి తెలుగు దేశం పార్టీ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చిందో చెప్పాలన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెట్టిన రాజధానిని ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించారు. స్వల్ప పెట్టుబడులతోనూ విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సీఎం జగన్ పరిపాలనా రాజధానిగానే విశాఖపట్నంను ప్రకటించారు. మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం జగన్ ఈ ప్రకటన చేశారన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎందుకు స్వాగతించకూడదని మంత్రి ప్రశ్నించారు.