తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలో అంధురాలైన యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా అని నిలదీశారు. సీఎం జగన్ నివాసానికి దగ్గర్లోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులకు, గంజాయికి తాడేపల్లి అడ్డాగా మారిందని దుయ్యబట్టారు.
తాడేపల్లిలో గతంలో జరిగిన రేప్ కేసులో ఓ నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం జగన్ సమీక్షించుకోలేకపోతే ఎలాగని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిదని.. దొంగతనానికి వచ్చి రేప్ చేశారని చెప్పే మంత్రులున్న ప్రభుత్వం ఇది అని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఇంతటి దారుణ అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర మహిళా కమిషన్ ఏం చేస్తోందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని దుయ్యబట్టారు. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒక్కటే అని.. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణ ఘటనలపై అన్ని వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో ఓ అంధ యువతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలైన యువతిపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతిని విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది.
దాడి చేసిన వ్యక్తి.. స్థానికుడు రాజుగా పోలీసులు గుర్తించారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం యువతితో రాజు అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆ యువకుడిని మందలించారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న నిందితుడు రాజు.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.