టీడీపీలో మరో బిగ్ వికెట్ ఔట్..బాబు కొంపముంచిన నాయకులు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చంద్రబాబుకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ జయమంగళ వెంకటరమణ పార్టీకి ఎట్టకేలకే రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు బలమైన కారణం ఏంటంటే.. పార్టీలో వర్గపోరు ప్రధానమైన అంశం అని స్వయంగా వెంకటరమణ వెల్లడించారు. పార్టీలో ఉన్న నాయకుల వల్లనే పార్టీని వీడుతున్నానని వెంకటరమణ చెప్పుకొచ్చారు. త్వరలోనే అధికార పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. అయితే.. టిడిపిలో కొంతమంది నాయకులు పెత్తనం చెలాయించడం వల్ల ఇలాంటి నాయకులు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. కావాలనే గ్రూపులుగా విడిపోయి.. పెత్తనం చెలాయించడం, పదవి వ్యామోహంతో లేనిపోనివి కల్పించి చెప్పడం.. ఇలా వారిలో వారికే పొత్తు కుదరక కొందరు పార్టీని వీడుతున్నారు.

అయితే.. వెంకటరమణ పని తీరు బాగాలేదని.. అందుకే ఆయన్ని కైకలూరు స్థానం నుంచి తప్పించి వేరే వాళ్లకు అవకాశం ఇస్తారని ఎప్పటి నుంచో టీడీపీలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకటరమణ పార్టీకి రాజీనామా చేశారు. 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జయమంగళ వెంకటరమణ 2005లో కైకలూరు జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా.. ఆయనకు టికెట్ రాలేదు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం టిడిపి కి రాజీనామా చేసి.. వైసీపీలో చేరే ఆలోచన చేస్తున్నారు.