రాజకీయాలలో ఎవరైనా కష్టపడి పని చేసేది.. రానున్న రోజుల్లో ఏదో ఒక చిన్న పదవి అయినా దక్కుతుందనే. ఒకవేళ పార్టీలో కష్టపడి పని చేసినా..ఎలాంటి ఫలితం దక్కకపోతే.. ఆ నేతలు వేరే పార్టీ వైపు చూడడం నేటి రాజకీయాలలో కామన్. అయితే అలాంటి ఓ టీడీపీ మాజీ మంత్రి 2020లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక ఈ తరుణంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే సీఏం జగన్ హామీ ఇచ్చారట. అయితే ప్రస్తుతం.. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలతో పాటూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో జరగనున్న సంగతి తెలిసిందే. కడపలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ జరుగుతోంది.
బుధవారం స్టీల్ ప్లాంట్ భూమిపూజ కార్యక్రమానికి వెళ్లిన సీఎం.. అభ్యర్థి ఎంపికపై ప్రస్తావించారట. కడప జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని దాదాపు ఖాయం చేసినట్లు సుబ్బారెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే సీఏం జగన్ అధికారికంగా ప్రకటన చేస్తామని చెప్పారట. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇస్తే.. స్థానికంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారట. రామసుబ్బారెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ విషయంలో సీఏం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.