కేశినేని నానికి కేంద్రం గుడ్ న్యూస్.. టీడీపీకి టెన్షన్

ఎంపీగా వరుసగా రెండుసార్లు గెలిచి.. సొంత పార్టీలో ఇమడలేక, ఏదో పార్టీలో ఉన్నామా లేదా అన్న విధంగా మారింది.. ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని నాని పరిస్థితి. సొంత పార్టీ నేతల తీరు నచ్చకనే నాని.. పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఆయన అధిష్టానంపై చూపిన వ్యతిరేకతను బట్టి పార్టీ మారబోతున్నారని అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసేలా ఓ వార్త తెరపైకి వచ్చింది. ఆయనకు కేంద్రం కీలక పోస్టులో నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కేశినేనిని ఎన్టీఆర్ జిల్లా దిశా కమిటీ ఛైర్ పర్సన్ గా నియమించింది. జిల్లాలో కేంద్ర పథకాలకు ఆయన ఇకపై కీలకం కానున్నారు. దీంతో కేశినేని నానికి దక్కిన పోస్టుపై ఇప్పుడు టీడీపీతో పాటు మిగతా పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. ఏపీలోని పలు జిల్లాలకు దిశా కమిటీల్ని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇందులో పలువురు ఎంపీల్ని ఆయా కమిటీల ఛైర్ పర్సన్లుగా నియమించింది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లా దిశా కమిటీ ఛైర్ పర్సన్ గా ఎంపీ కేశినేని నానిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని బట్టి ఎంపీ కేసినేని నాని బీజేపీలో జంప్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చివరకు కేశినేని నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.