అమరరాజా బ్యాటరీ పరిశ్రమ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. కంపెనీ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా కంపెనీలో కాలుష్య కారకాలపై కొనసాగుతున్న వివాదంలో కాలుష్య నియంత్రణ మండలి చేపట్టే చర్యలను తాము అడ్డుకోబోమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. అమరరాజా కంపెనీ వల్ల తమ ప్రాంతాల్లో కాలుష్యం సంభవిస్తోందని పలువురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆ కంపెనీకి నోటీసులు అందించింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరరాజా బ్యాటరీస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే తదుపరి దశలో ఈ కేసు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. కేసు రాజకీయ ప్రేరేపితం అని అమరరాజా కంపెనీ న్యాయస్థానానికి విన్నవించింది. అమర్ రాజా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ రాజకీయ కారణాలతో 34 సార్లు నోటీసులు ఇచ్చి తమ క్లయింట్‌ను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించకుండా రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు పోవాల్సిందే అని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీస్ పై ప్రజల సమక్షంలో చర్చ నిర్వహించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది.