కన్నా లక్ష్మీనారాయణ ఎట్టకేలకే టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నేపధ్యంలోనే కొందరు టిడిపి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని టీడీపీలోకి తీసుకోవడం బాబుకు తప్ప ఎవరికీ ఇష్టంలేదని, కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో ఎక్కడ పోటీచేసినా ఓడించడం గ్యారెంటీ. కన్నాను టీడీపీలోకి తీసుకోవడం నాకే కాదు.. సీనియర్లందరూ సిగ్గేస్తుందని అంటున్నారు’ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మొన్నటి వరకు చెబుతూ వచ్చిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చెరడంపై రాయపాటి తీవ్రంగా వ్యతిరేకించారు. తనను, చంద్రబాబును తిట్టిన తిట్లకు కన్నా లక్ష్మీనారాయణ ఏం సమాధానమిస్తారని సాంబశివరావు ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడం అన్నది ఒక తెలివి తక్కువ పని అని విమర్శించారు.
తమ సామాజిక వర్గాన్ని కూడా దూషించారని కన్నాపై ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు దగ్గరకు తీసుకోవడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని నిలదీశారు. పార్టీలో ఉన్న వారిని చంద్రబాబు ఏమాత్రం దెబ్బ తీయడం సరికాదని రాయపాటి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇన్నేళ్లు పనిచేశా.. నాకేం చేశారు? ఏమి ఇచ్చారు..? అంటూ రాయపాటి సాంబశివరావు చంద్రబాబును ప్రశ్నించారు. ఇలా అయితే ఇక నేను చంద్రబాబు వద్దకు వెళ్ళను అంటూ రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయపాటి మాటలను బట్టి చూస్తుంటే.. ఆయన త్వరలో పార్టీ మారబోతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.