ఏపీ రాజకీయాలలో ఎన్నడూ లేని ఉత్కంఠ వాతావరణం నెలకొంటోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ఆయా పార్టీల నాయకులు ఎంతగానో ప్రయాస పడుతున్నారు. అయితే.. అధికార పార్టీ వైసీపీ.. గెలుపు గుర్రం ఎక్కేందుకు.. ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే రెండు వ్యూహాలను అమలు చేస్తోంది. ఒకటి సంక్షేమం, రెండవది మూడు రాజధానులు. సంక్షేమం ద్వారా సమాజంలోని లబ్ధిదారుల౦దరికీ.. సంక్షేమాన్ని అందిస్తున్నామని.. ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందుతోందని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపధ్యంలోనే.. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. వచ్చే ఎన్నికల నాటికి.. వ్యూహాలు ఎటు నుంచి ఎటైనా మారే అవకాశం ఉంటుంది. ప్రజల మూడ్.. అప్పటికి ఎన్నికల సరళి.. ఇతర పార్టీల వ్యూహాలు.. వీటన్నింటినీ బేరీజు వేసుకుని.. బీసీ కార్డును బయటకు తీసే యోచనలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. అవసరం అనుకుంటే.. జనరల్ స్థానాలను సైతం 20 శాతం బీసీలకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే సిఎం జగన్ బీసీలకు పెద్దపేట వేశతో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. ఆయా అభ్యర్ధులను ప్రకటించింది జగన్ ప్రభుత్వం. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 స్థానాలు బీసీలకే కట్టబెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండలిలో 37 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తే.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీలకు ఏకంగా 43 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని వైసీపీ నాయకులు అంటున్నారు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని తొలి నుండి జగన్మోహనరెడ్డి చెబుతున్నారని వైసీపీ అంటున్నమాట. చంద్రబాబు కేవలం మాటలు చెబితే.. తాము చేతల్లో చూపించామని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం జగన్ ఎమ్మెల్సీ స్థానాలలో బీసీలకు అధిక ప్రాధాన్యత కలిగించడం ఆ పార్టీకి ప్లస్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు అధిక స్థానాలు కేటాయించి బీసీ సెంటిమెంటు ను మరొక్కసారి వర్క్ ఔట్ చేసి.. మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసీపీ వ్యూహరచనలు మొదలు పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. మరి గత ఏడాది స్థానిక ఎన్నికల్లో ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయిన వైసీపీ.. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేయబోతుందని అంటున్నారు. మరి టిడిపి ఎలాంటి ఎత్తులు వేస్తుందో అనేది చూడాలి.