టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసుకు సంబంధించి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఇదే కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేశారు.
నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఈ సర్వేలో అసలు గుట్టు అంతా బయట పడింది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి,అది కూడా పంట కాలువను ఆక్రమించి అడ్డగోలుగా అక్రమoగా కట్టారు. చివరికి అయ్యన్నగుట్టు వ్యవహారం సమగ్ర భూ సర్వేతో బట్టబయలయ్యింది. ఈ కేసులో అయ్యన్నకు శిక్ష పడటం ఖాయమని అంటున్నారు.. కొందరు న్యాయవాదులు